Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రోటీన్ల‌ను జీర్ణం చేయ‌డంలో అద్భుతంగా ప‌నిచేసే పైనాపిల్‌..

    Author VENKATESH | 04 Sep 2026, 02:05 PM | HEALTH
    ప్రోటీన్ల‌ను జీర్ణం చేయ‌డంలో అద్భుతంగా ప‌నిచేసే పైనాపిల్‌..

    భోజనం తర్వాత పైనాపిల్‌ తినడం వల్ల జీర్ణక్రియకు కొంత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ ప్రొటీన్లను చిన్న భాగాలుగా విడగొట్టడంలో సహాయపడుతుంది. అందుకే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న తర్వాత పరిమిత మోతాదులో పైనాపిల్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్‌ ప్రొటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌ల సమూహానికి చెందినది. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పులు వంటి ఆహారాల్లో ఉండే సంక్లిష్ట ప్రొటీన్లను జీర్ణక్రియ సమయంలో చిన్న పెప్టైడ్లు, అమైనో ఆమ్లాలుగా విడగొట్టడంలో ఇది సహాయపడుతుంది. ఇవి శరీరం సులభంగా గ్రహించగలిగే రూపాలేన‌ని వారు చెబుతున్నారు.
    ఈ ఎంజైమ్ వ‌ల్లే..
    పైనాపిల్‌లో బ్రోమెలైన్‌ పండు భాగంలోనే కాకుండా దాని కాడలో కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్‌ కారణంగానే పైనాపిల్‌ను జీర్ణక్రియకు సహాయపడే పండుగా పరిగణిస్తారు. అయితే పైనాపిల్‌ తినడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా దాని మీదే ఆధారపడదు. జీర్ణాశ‌యంలో విడుదలయ్యే ఆమ్లాలు, సహజ జీర్ణ ఎంజైమ్‌లతో కలిసి ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. భోజనం తర్వాత పైనాపిల్‌ తినడం వల్ల పెద్ద మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు కలిగే కడుపు భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉన్న భోజనం తర్వాత ఇందులోని బ్రోమెలైన్‌ ప్రొటీన్ల విచ్ఛిన్న ప్రక్రియకు తోడ్పడతాయి. అయితే దీనిపై వ్యక్తుల శరీర స్పందన, తీసుకునే పరిమాణం ఆధారంగా ప్రభావం మారే అవ‌కాశం ఉంటుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్‌తో పాటు పీచు పదార్థం, విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి పైనాపిల్‌ను పోషకాలు కలిగిన పండుగా మారుస్తాయి. కాబట్టి సమతుల ఆహారంలో భాగంగా పరిమిత మోతాదులో పైనాపిల్‌ను తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.
    పేగుల ఆరోగ్యానికి..
    పైనాపిల్‌లోని పీచు పదార్థం పేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది సాధారణంగా పేగు కదలికలు సక్రమంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడే అవకాశం ఉంటుంది. పైనాపిల్‌లో విటమిన్‌ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పైనాపిల్‌లోని ఇతర మొక్కల సమ్మేళనాలు కూడా దాని పోషక విలువల‌కు దోహదం చేస్తాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్‌) ప్రకారం 100 గ్రాముల పైనాపిల్‌లో సుమారు 48 కిలోకేలరీల శక్తి, 86 గ్రాముల తేమ, 0.5 గ్రాముల ప్రొటీన్‌, 0.1 గ్రాముల కొవ్వు, 11-12 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 1.4 గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. అలాగే కాల్షియం 20 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్‌ 9 మిల్లీగ్రాములు, ఐరన్‌ 0.3 మిల్లీగ్రాములు, పొటాషియం 147 మిల్లీగ్రాములు, విటమిన్‌ సి సుమారు 39 మిల్లీగ్రాములు ఉంటాయి. కొద్దిమొత్తంలో బీటా కెరోటిన్‌ కూడా లభిస్తుంది.
    క‌డుపు భారంగా ఉంటే..
    అధిక ప్రొటీన్‌ ఆహారం తీసుకునే వారు, భోజనం తర్వాత అప్పుడప్పుడు కడుపు భారంగా అనిపించే వారు పైనాపిల్‌ను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. వ్యాయామం చేసే వారు కూడా సమతుల ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవచ్చు. వయసు పెరిగిన కొందరిలో జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే కూడా పైనాపిల్‌ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే పైనాపిల్‌ను ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. దాని పుల్లని, ఘాటైన రుచి కారణంగా కొందరికి నోట్లో మంట లేదా చికాకు కలుగుతాయి. అందరికీ ఇది సరిపోదు. ముఖ్యంగా పైనాపిల్‌కు అలర్జీ ఉన్నవారు దీనిని తీసుకోకూడ‌దు. బ్రోమెలైన్‌ సప్లిమెంట్లను మాత్రం వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం మంచిది కాదు. పండుగా పైనాపిల్‌ తినడం, అధిక మోతాదులో బ్రోమెలైన్‌ సప్లిమెంట్లు తీసుకోవడం రెండూ ఒకే విషయం కాదు. అందువల్ల సప్లిమెంట్ల విషయంలో వైద్యుల సూచన పాటించడం అవసరం.