Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బడుల మూత తిరోగమనం.. సీఎం రేవంత్‌రెడ్డికి 125 మంది మేధావుల బహిరంగ లేఖ

    Author VENKATESH | 08 Jul 2026, 12:22 PM | ఎడ్యుకేషన్
    బడుల మూత తిరోగమనం.. సీఎం రేవంత్‌రెడ్డికి 125 మంది మేధావుల బహిరంగ లేఖ

    రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదింపుపై చేసిన ప్రకటనను పునఃసమీక్షించాలని, 23,000 బడుల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి “జూన్‌ 6వ తేదీన మీరు బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 4,000కు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామని చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, పౌరసమాజంలో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ నిర్ణయం వల్ల సంభవించబోయే ప్రమాదకరమైన విద్య, సామాజిక పరిణామాలను మీ దృష్టికి తీసుకురావడానికే ఈ బహిరంగ లేఖను సమర్పిస్తున్నాము.Geographic Reference
    1. విద్యాహక్కు చట్టం ఉల్లంఘన:
    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఏ, విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత. విద్యను పొందడం బాలల హక్కు. మీ ప్రకటన అమల్లోకి వస్తే, రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీల్లో దాదాపు 8,769 గ్రామాల్లోని ప్రభుత్వ బడులు శాశ్వతంగా మూతపడతాయి. ఈ మూసివేత జాబితాలో వందలాదిమంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు కూడా చేరే అవకాశం ఉన్నది. నివాస ప్రాంతానికి సమీపంలో పాఠశాలలు లేకపోతే, రవాణా, భద్రతా కారణాల వల్ల దళిత, ఆదివాసీ, బీద బడుగువర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. డ్రాప్‌ అవుట్‌ అయిన కొంతమంది దగ్గర ఉన్న ప్రైవేట్‌ విద్యకు నెట్టబడితే మరికొంతమంది బాల కార్మికులుగా తయారయ్యే ప్రమాదం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనది. దేశ చరిత్రలోనే అత్యంత తిరోగమన, ప్రజావ్యతిరేక చర్యగా మిగిలిపోతుంది.
    2. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హామీల ఉల్లంఘన:
    విద్యపై పెట్టే ఖర్చు… ఖర్చు కాదు, అది భవిష్యత్తుపై పెట్టుబడి అని మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంటూ, బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేశారు. కానీ, ప్రస్తుతం కేటాయింపులు 8.2% దాటలేదు. జాతీయ సగటు 15% ఉండగా, తెలంగాణ వెనుకబడి ఉండటం శోచనీయం. ఇప్పుడు ఏకంగా 23,000 పాఠశాలలను మూసివేయాలనే ఆలోచన అత్యంత విచారకరం.
    3. తీవ్ర నిర్లక్ష్యం కుప్పకూలిన పర్యవేక్షణ:
    రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగానికి అడ్డూఅదుపు లేకుండా అనుమతులు ఇవ్వడం, వారిపై ఎటువంటి నియంత్రణలు లేకపోవడం వల్ల విద్య వ్యాపారీకరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 34% మంది పిల్లలు మాత్రమే మిగిలారనే వాస్తవం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం వల్ల అది మొక్కుబడిగా తయారైంది. అందువల్ల ప్రభుత్వ బడుల్లో చేరికలు తగ్గి, జీరో ఎన్‌రోల్‌మెంట్‌ బడులు పుట్టుకొస్తున్నాయి. అసలు పాఠశాలల్లో చదువు సరిగ్గా సాగుతుందో లేదో చూసే అధికారులే లేరు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు లేరు. 633 మండలాలకు గాను 612 మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు లేరు. పర్యవేక్షించే అధికారులే లేనప్పుడు విద్యాప్రమాణాలు పడిపోవడంలో ఆశ్చర్యం లేదు. విద్యా ప్రమాణాలను తెలిపే పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం దక్షిణాది రాష్ర్టాల్లోనే తెలంగాణ అత్యంత వెనుకబడి ఉన్నది.

    4. సమగ్ర అధ్యయనం అవసరం:
    జీరో ఎన్రోల్‌మెంట్‌ బడులు ఏర్పడటానికి గల కారణాలపై (మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత, విచ్చలవిడిగా ప్రైవేట్‌ బడులకు అనుమతులు, పర్యవేక్షణ లోపం) క్షేత్రస్థాయిలో లోతైన, సమగ్రమైన అధ్యయనం చేయకుండా.,,నేరుగా బడులను మూసివేయాలనుకోవడం సరైనది కాదు.
    తక్షణమే చేపట్టవలసిన చర్యలు : నిరంతరంగా జరుగుతున్న ఈ విద్యావిధ్వంసాన్ని ఆపడానికి, తక్షణమే ప్రభుత్వం కింది నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. బడుల మూసివేత ప్రకటనను ఉపసంహరించుకోవాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలి. మీ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా ప్రతి చిన్న గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలి. అన్ని బడుల్లో అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, డిజిటల్‌ వనరులు సమకూర్చాలి. ఖాళీగా ఉన్న అన్ని బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదు. ప్రైవేట్‌ పాఠశాలలను పకడ్బందీగా నియంత్రించేందుకు జీవో నెంబర్‌ 1ని అమలు చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోకపోతే తెలంగాణ సమాజ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. కావున, ముఖ్యమంత్రి గారు తమ నిర్ణయాన్ని తక్షణమే పునఃస్సమీక్షించుకొని, ప్రభుత్వ బడులను మూసివేసే ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నాము.