Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు- సంక్షోభం వేళ కేంద్రం కీలక నిర్ణయం

    Author VENKATESH | 12 Jun 2026, 12:28 PM | TELANGANA
    బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు- సంక్షోభం వేళ కేంద్రం కీలక నిర్ణయం

    పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం వల్ల ఇంధన సరఫరా కష్టమవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు పెట్రోల్ పంపుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. బదులుగా వారి అవసరాల కోసం ఇంధనాన్ని బల్క్ అమ్మకపు కేంద్రాల నుంచి పొందాలని సూచించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమల్లోకి ఉంటుందని పేర్కొంది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం నింపవద్దని రిటైల్‌ అవుట్‌లెట్ల యాజమాన్యానికి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

    డీజిల్‌కు పెరిగిన డిమాండ్
    ధరల వ్యత్యాసం కారణంగా బల్క్ వినియోగదారులు పెట్రోల్ పంపుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించడంతో కొన్ని ప్రాంతాలలో డీజిల్‌కు అసాధారణ డిమాండ్ పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలోని పెట్రోల్ పంపుల వద్ద లీటరు డీజిల్ ధర రూ. 95.20 కాగా, బల్క్ సరఫరాదారుల వద్ద లీటర్ డీజిల్ ధర రూ. 134.50గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఈ ఆంక్షలు విధించింది.


    ప్రభుత్వ రంగ బంకుల్లో పెరిగిన సేల్స్
    పశ్చిమాసియా సంక్షోభం తరువాత పెరిగిన ఇంధన ధరల నుంచి సాధారణ వినియోగదారులను కాపాడటానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రిటైల్ ధరలను సర్దుబాటు చేయడంతో ఈ వ్యత్యాసం ఏర్పడింది. టెలికాం టవర్లు, విద్యుత్ ఉత్పత్తి, ఇతర ఫీడ్‌స్టాక్ అవసరాల కోసం డీజిల్‌ను ఉపయోగించే పరిశ్రమలు వంటి బల్క్ వినియోగదారులకు మార్కెట్ ధర వసూలు చేస్తుండగా, రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ధరలు ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ధరలలోని ఈ వ్యత్యాసం వల్ల పెట్రోల్, డీజిల్‌ను అధిక రేట్లుకు విక్రయించే ప్రైవేట్ రంగ అవుట్‌లెట్లలో అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్ పంపుల్లో అమ్మకాలు పెరిగాయి.

    ఇవి కూడా చదవండి

    90రోజులపాటు ఆంక్షలు
    కాగా మే నెలలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లో పెట్రోల్ అమ్మకాలు 4.8 శాతం, డీజిల్ అమ్మకాలు 6.4 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో రిటైల్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం వినియోగదారులు రిటైల్‌ పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బల్క్‌ సప్లయ్‌ చైన్‌ల నుంచే వారు పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయాలని వెల్లడించింది. అంతేగాకుండా పెట్రోల్‌ బంకుల వద్ద ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్‌కు రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్‌ను విక్రయించొద్దని ఆదేశాలిచ్చింది. ఈ డీజిల్‌ను పునర్‌విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తొలుత 90 రోజుల వరకు అమల్లో ఉంటాయని చెప్పింది. అవసరమైతే పరిస్థితిని బట్టి పొడిగిస్తామని ప్రకటించింది.

    తగు చర్యలకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశాలు
    ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా ఈ చర్య అవసరమైందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరిస్థితి అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసులు, షిప్పింగ్ లాజిస్టిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపిందని స్పష్టం చేసింది. ఇంధన నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అనధికారిక సేకరణ, మళ్లింపు వంటి విషయానికి సంబంధించిన ఈ ఉత్తర్వును అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. పెట్రోల్, డీజిల్ సమాన లభ్యతను నిర్ధారించడం, నిల్వలు, మళ్లింపులను నివారించడం, దేశవ్యాప్తంగా నిరంతరాయ ఇంధన సరఫరాలను కొనసాగించడం ఈ చర్యల లక్ష్యమని పేర్కొంది.