Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గ్రామ్య ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మూడు రోజుల నివాస శిక్షణ కార్యక్రమం

    Author VENKATESH | 16 Oct 2026, 08:16 PM | నల్గొండ
    గ్రామ్య ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మూడు రోజుల నివాస శిక్షణ కార్యక్రమం

    దేవరకొండ,16అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో కిశోర బాలికల సాధికారత,నాయకత్వ లక్షణాల అభివృద్ధి,హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేవరకొండలో మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవరకొండ,చందంపేట మండలాలకు చెందిన 13 గ్రామాల నుంచి 40 మంది కిశోర బాలికలు తమ తల్లిదండ్రుల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ శిక్షణలో భాగంగా బాలికలకు లింగ సమానత్వం,నాయకత్వ లక్షణాలు,బాలికల హక్కులు, సంబంధిత చట్టాలు,సైబర్ భద్రత,రుతుక్రమ ఆరోగ్యం– పరిశుభ్రత,సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు,లైంగిక వేధింపుల నివారణ, బాల్యవివాహాల నిరోధం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే,బాలికలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు సహాయం పొందేందుకు అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు, సంబంధిత ప్రభుత్వ సేవలు, సహాయక వ్యవస్థలు,రిఫరల్ సేవల గురించి వివరించారు. బాలికలు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం, తమ హక్కులను తెలుసుకోవడం,అన్యాయాలను ప్రశ్నించడం,సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొనడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ కార్యక్రమంలో బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలు,పాటలు,నాటికల ద్వారా వివిధ సామాజిక సమస్యలను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా బాల్యవివాహాలు, లింగ వివక్ష,బాలికల భద్రత వంటి అంశాలపై ప్రదర్శించిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమాలు బాలికల్లో ఐక్యత, పరస్పర సహకారం,నాయకత్వ లక్షణాలు,సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించేందుకు దోహదపడ్డాయి.ఈ శిక్షణ కార్యక్రమానికి డి.రుక్మిణి రావు, సెక్రటరీ,సుమలత,డైరెక్టర్ రిసోర్స్ పర్సనస్ గా వ్యవహరించి,వివిధ అంశాలపై బాలికలకు అవగాహన కల్పించారు.బాలికలు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, విద్యను కొనసాగిస్తూ తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు. బాల్యవివాహాలు,లింగ వివక్ష, లైంగిక వేధింపులు వంటి సమస్యలను నివారించడంలో బాలికలతో పాటు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,గ్రామస్థాయి సంఘాలు, ప్రభుత్వ శాఖలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బాలికలు తమ హక్కులను తెలుసుకొని, ఆత్మవిశ్వాసంతో ఎదిగి, సమాజంలో మార్పుకు నాయకులుగా నిలవాలనే లక్ష్యంతో గ్రామ్య సంస్థ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.