Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తగ్గిన పసిడి రేట్లు!

    Author VENKATESH | 07 Sep 2026, 01:20 PM | BUSINESS
    తగ్గిన పసిడి రేట్లు!

    బంగారం కొనాలనుకునే వారికి ఇవాళ కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం రేట్లు స్వల్పంగా దిగివచ్చాయి. సోమవారం స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు సుమారు 4,396.91 డాలర్లు వద్ద ఉండగా.. గ్రాము ధర 141.42 డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాము ₹15,479, 22 క్యారెట్ల బంగారం ₹14,189గా ఉంది.
    బంగారం గ్రాము 10 గ్రాములు
    24 క్యారెట్లు ₹15,479 ₹1,54,790
    22 క్యారెట్లు ₹14,189 ₹1,41,890
    స్పాట్ బంగారం ధ‌ర ఔన్‌కు 4,396.91 డాల‌ర్లు
    స్పాట్ బంగారం ధ‌ర గ్రాముకు 141.31 డాల‌ర్లు
    డిజిట‌ల్ బంగారం గ్రాముకు ₹16,235–₹16,539
    అంతర్జాతీయ మార్కెట్‌లో ఎందుకు తగ్గింది?
    అమెరికా ఆర్థిక గణాంకాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆగస్టు నెలలో అమెరికా ఉద్యోగాల వృద్ధి అంచనాలను మించడంతో.. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందన్న అంచనాలు పెరిగాయి. దీంతో వడ్డీ రాబడి ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొంత తగ్గింది. ఫలితంగా స్పాట్‌ గోల్డ్‌ ధర 4,396.91 డాల‌ర్లు దిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతోంది. ఈ వారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో బంగారం మార్కెట్‌లో మరింత హెచ్చుతగ్గులు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
    పసిడి ప్రియులకు కీలకమైన విషయం..
    బంగారం ధర ఒకే దిశలో కదిలే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌, డాలర్‌ విలువ, అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు.. ఇవన్నీ కలిపి దేశీయ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇవాళ స్వల్పంగా తగ్గినా.. రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశం కూడా లేకపోలేదు
    .ప్రస్తుతం ప‌ది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹1.41 లక్షలకుపైగా ఉండటంతో.. నగలు కొనేవారు బేస్‌ రేటుతో పాటు మేకింగ్‌ ఛార్జీలు, జీఎస్టీని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ₹1,41,890 విలువైన 10 గ్రాముల 22K బంగారానికి 12 శాతం మేకింగ్‌ ఛార్జీ కలిపితే.. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు సుమారు ₹1.64 లక్షలకు చేరుతుంది.
    డిజిటల్‌ గోల్డ్‌ ధర ఎంత?
    భౌతిక బంగారంతో పోలిస్తే డిజిటల్‌ గోల్డ్‌ ధరలో ప్రొవైడర్‌ను బట్టి తేడా కనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్ల ప్రకారం డిజిటల్‌ గోల్డ్‌ గ్రాముకు సుమారు ₹16,235–₹16,539 మధ్య ఉంది. కొనుగోలు ధరలో జీఎస్టీ, ప్లాట్‌ఫామ్‌ మార్జిన్‌ తదితర అంశాలు ప్రభావం చూపుతాయి.
    మొత్తంగా.. అంతర్జాతీయంగా పసిడి ధ‌ర కొంత త‌గ్గిన‌ప్ప‌టికీ.. దేశీయ మార్కెట్‌లో ధరలు ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దీంతో ‘ఇప్పుడే కొనాలా? మరికొంత తగ్గుతుందా?’ అన్నది పసిడి ప్రియులను అయోమయానికి గురిచేస్తోంది. రానున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం తదుపరి దిశను నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.