Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మేడారం నుండి ములుగు వరకు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలతో సీఎం పర్యటన

    Author VENKATESH | 16 Aug 2026, 10:02 PM | ములుగు
    మేడారం నుండి ములుగు వరకు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలతో సీఎం పర్యటన

    - వికలాంగులు,ఒంటరి మహిళలు,వితంతువులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల అందజేత
    - రూ.16,007 కోట్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ములుగు నుంచి శ్రీకారం.
    - నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం,తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం.
    - మల్లూరు నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
    - జంపన్నవాగు సమగ్ర అభివృద్ధికి చర్యలు
    - మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి
    - ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
    - ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క
    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 16(బీవీకే న్యూస్):
    ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి,గిరిజన సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల దర్శనం,చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ, తాగునీటి శుద్ధీకరణ కేంద్రం ప్రారంభం,గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం, అభివృద్ధి పనుల పైలాన్, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ,నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కామారెడ్డి జిల్లా నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మేడారం చేరుకున్నారు.ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ సీతక్క,అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎంపీలు బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు,నాయిని రాజేందర్ రెడ్డి,కోరం కనకయ్య,పాయం వెంకటేశ్వర్లు,తెల్లం వెంకట్ రావు,జారే ఆదినారాయణ, మురళి నాయక్,జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి,శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అక్కడి నుంచి కాన్వాయ్‌లో మేడారం సమ్మక్క - సారలమ్మ వన దేవతల ప్రధాన ముఖ ద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు,గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, నృత్యాల నడుమ సాదర స్వాగతం పలికారు.
    అనంతరం వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తులాభారం లో 66 కిలోల నిలువెత్తు బంగారం(బెల్లం)సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను ప్రార్థించారు.పూజల అనంతరం గిరిజన పూజారులు ముఖ్యమంత్రి, మంత్రులు,ప్రజాప్రతినిధు లు,ముఖ్య అతిథులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులకు సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలు,వికలాంగులు, వితంతువులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, చెక్కులు ముఖ్యమంత్రి అందజేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శుద్ధ తాగు నీటి కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.అనంతరం ఆలయ పూజారులు,డోలు వాయిద్య కళాకారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముచ్చటించి వారితో కలిసి చిత్రాలు దిగారు.మేడారం ప్రధాన కూడలిలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులను ముఖ్య మంత్రి ఆప్యాయంగా పలకరించారు.
    మేడారం కార్యక్రమాలు ముగించుకున్న ముఖ్య మంత్రి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగు జిల్లా కేంద్రానికి బయలుదేరారు.ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు,జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,స్థానిక ప్రజాప్రతి నిధులు,జిల్లా అధికారులు, స్వాగతం పలికారు.అక్కడి నుండి ములుగు గట్టమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి పైలాన్ ఆవిష్కరించి రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో నూతన అధ్యాయానికి ములుగు నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 16, 007 కోట్లతో 2,145గ్రామీణ రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే భారీ ప్రణాళికను ప్రభుత్వం చేపట్టింది.గ్రామ పంచాయతీల నుండి మండల కేంద్రాలు, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
    అనంతరం నూతన సమీకృత ములుగు జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సూచించే పైలాన్‌ను ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత ములుగు జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు.జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ.868 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
    ములుగు సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ముఖ్యమంత్రి
    కలెక్టరేట్ సభా వేదిక నుండి ప్రజలను ఉద్దేశించి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మక్క- సారలమ్మల ఆశీస్సులతోనే గతంలో పిసిసి అధ్యక్షుడిగా తాను చేపట్టిన పాదయాత్ర ను ములుగు గడ్డ నుండి ప్రారంభించానని గుర్తు చేశారు.రాష్ట్ర నలుమూలల గ్రామాలు,గూడేలు,పల్లెల్లో పర్యటించి ప్రజలసమస్యలు తెలుసుకున్నామని,ప్రజలకు ఇచ్చిన భరోసా మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని,గిరిజనప్రాంతాల్లో విద్య,వైద్యం,సాగునీరు, రహదారులు,ఉపాధి అవకాశాలు,పర్యాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.సమ్మక్క - సారలమ్మ సన్నిధిని మరింత వైభవంగా తీర్చిదిద్ది మేడారం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి చేస్తామని ముఖ్య మంత్రి తెలిపారు.మేడారం సమ్మక్క - సారలమ్మ దేవాలయ ప్రాంతాన్ని రామప్ప,వేయి స్తంభాల గుడి తరహాలో విశిష్టంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మేడారం ఆధ్యాత్మిక, గిరిజన సాంస్కృతిక విశిష్టత మరింత వెలుగొందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు మల్లూరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేడారం వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని జంపన్నవాగు ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.జంపన్న వాగుపై అవసరమైన చోట చెక్‌డ్యామ్‌లు,స్నానఘట్టాల నిర్మాణం చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గోదావరి తీరంలో ఉన్న ములుగు జిల్లాలో సాగునీటి కొరత లేకుండా చేయడానికి అవసరమైన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సిఎం పేర్కొన్నారు.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు.ఆదివాసీ బిడ్డల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందు కు ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.
    యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
    నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆ తర్వాత నైపుణ్య విద్యపై దృష్టి సారించి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చు కునేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.12వ తరగతి అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా యువతకు సాంకేతిక,వృత్తినైపుణ్యాలుపెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ములుగు ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం అందు బాటులోకి రావడం ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.జర్మనీ,జపాన్,కొరియా వంటి దేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు జర్మన్,జపనీస్, కొరియన్ తదితర విదేశీ భాషలతో పాటు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
    మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని,ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ సమ్మక్క–సారలమ్మ పేరుతో మహిళలకు నాణ్యమైన చీరలను అందించనున్నా మని ముఖ్యమంత్రి తెలిపారు.ఈ ఏడాది డిసెంబర్‌లో చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్య మంత్రి వెల్లడించారు.మంత్రి సీతక్క పర్యవేక్షణలో చీరల ఎంపిక,రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు.

    నూతన సమీకృత ములుగు జిల్లా కార్యాలయాల సముదాయం అందుబాటు లోకి రావడం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట ప్రజలకు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు.త్వరలోనే జిల్లాలో ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన ప్రాంతాల పురోగతి, మహిళల సంక్షేమం, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన వైద్య సేవలు,సాగునీరు, రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం: మంత్రి సీతక్క
    ముందుగా మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ..ములుగు జిల్లా,ములుగు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంత మైన ములుగును హైదరా బాద్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
    నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్స వానికి హాజరైన ముఖ్య మంత్రి,మంత్రులు,ప్రజాప్రతి నిధులు,అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.సమ్మక్క- సారలమ్మ సన్నిధిని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, ములుగు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పలు మార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం ఈప్రాంతం పై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.సాగునీటి రంగంలో పొట్లాపూర్ ఎత్తి పోతల పథకం,రామప్ప - లక్నవరం అనుసంధాన పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.సమ్మక్క- సారలమ్మ సన్నిధి అభివృద్ధితో పాటు జిల్లాలో విద్య,వైద్యం,పర్యాటకం, గృహ నిర్మాణం,సాగునీరు, ఉపాధి అవకాశాలు,మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని,అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కట్టుబడి పనిచేస్తు న్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు,జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్,జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య,మేడారం కార్యనిర్వహణ అధికారి వీరస్వామి,ఇతర ప్రజాప్రతి నిధులు,జిల్లా అధికారులు, మహిళాసంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.