Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వచ్చే నెల నుంచి మళ్లీ 'ఉపాధి' పనులు - వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం!

    Author VENKATESH | 21 Jul 2026, 01:07 PM | TELANGANA
    వచ్చే నెల నుంచి మళ్లీ 'ఉపాధి' పనులు - వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం!

    ఉపాధి హామీ పథకం జీ రాంజీలో భాగంగా వర్షాకాలంలో రెండు నెలలు పాటు పనులకు విరామం ఇచ్చారు. ఎందుకంటే వ్యవసాయ సీజన్‌లో కూలీలు అందుబాటులో ఉండేందుకు దీనిని నిలిపి వేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ఈసారి ఎల్​నినో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రెండు నెలల విరామం లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది.

    అక్టోబర్ వరకు వర్షాభావం : నిజానికి రాష్ట్రంలో వర్షాకాలం సీజన్​ ఎప్పటిలాగే ఉంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జీరాంజీ పథకాన్ని నిలిపి వేయాల్సి ఉండేది. కానీ ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంలో 45 శాతమే రైతులు పంటలు వేయగలిగారు. అయితే వచ్చే అక్టోబర్ వరకు ఎల్​నినో పరిస్థితుల వల్ల వర్షాలు తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    యాసంగి మీద ప్రభావం పడే అవకాశం : వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం యాసంగి మీద ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీరాంజీకి రెండు నెలల విరామం అమలు చేయటం కష్టమని అధికారులు గుర్తించారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీ రాంజీలో 2 నెలల విరామం సాధ్యం కాదని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తోంది.

    ఇవి కూడా చదవండి

    రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమం : ఇదిలా ఉండగా ఎల్​నినోను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీంట్లో భాగంగా జల సంరక్షణ పనులు పెద్దఎత్తున చేపట్టాలని అనుకుంటుంది. దీంతో జీరాంజీ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జలసిరి కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్‌ జలసిరి నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.

    నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు : ఎల్​నినో కారణంగా సంభవిస్తున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జీరాంజీ పథకం కింద నీటిసంరక్షణ, భూగర్భజలాల పెంపు, కరవు నివారణ, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించనున్నారు. దీనికి సంబంధించిన కార్యచరణను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా మొత్తం 9.60 లక్షల ఇంకుడు గుంతలు, 5,000 బోర్​వెల్​ రీఛార్జి నిర్మాణాలు, 5,000 ఊట కుంటల నిర్మాణాలు జరపనున్నారు. 25,000 సేద్యపు కుంటలను ఇప్పటికే మహిళా రైతుల కోసం మంజూరు చేశారు. దరఖాస్తులు వస్తే వాటిని కూడా మంజూరు చేయనున్నారు.

    అక్టోబర్ వరకు 4.5 కోట్ల పని దినాలు : జీరాంజీ పథకం జులై 1న ప్రారంభమైంది. కాగా తొలి దశలో భాగంగా అక్టోబరు వరకు 4.5 కోట్ల పనిదినాలను సృష్టించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రోజుకు సుమారు 2.5 లక్షల మంది కూలీలకు ఉపాధి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలసిరి కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టనున్నారు. రోజూ 5 లక్షల పనిదినాల ద్వారా ఉపాధి కల్పించేందుకు నిర్దేశించారు.