Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం జూలై 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్

    Author VENKATESH | 13 Jul 2026, 11:07 AM | నల్గొండ
    విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం జూలై 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్

    ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్
    దేవరకొండ 12జూలై (BVK 3 న్యూస్ ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున దేవరకొండ ఏబీవీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు* పెండింగ్‌లో ఉండటం వల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.విద్యను ప్రాథమిక హక్కుగా, సామాజిక సమానత్వానికి పునాదిగా భావించాల్సిన ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పక్కనబెట్టి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల పేరుతో ఒత్తిడి తీసుకువస్తున్నాయని, పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగానికి ఇచ్చిన హామీలు అమలులో కనిపించడం లేదని యలమల గోపీచంద్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అవసరమైన చొరవ చూపడంలో విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని అన్నారు.
    రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, ఖాళీ అధ్యాపక పోస్టులు, సరైన మౌలిక వసతుల లేమి, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ కనిపించకపోవడం వల్ల ఉన్నత విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని ఎత్తివేయాలనే కుట్ర చేయడం వల్ల వారి చదువులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. విద్యార్థుల సమస్యలను కేవలం పరిపాలనా అంశాలుగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జాతీయ ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం పరిగణించాలని సూచించారు.విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఏబీవీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, ఈ నేపథ్యంలోనే జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు ఈ బంద్‌కు మద్దతు తెలిపి ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధమైన ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.ప్రభుత్వం విద్యార్థుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సమాజంతో కలిసి ఏబీవీపీ మరింత ఉద్ధృత ఉద్యమాలను చేపడుతుందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర జాయింట్ సెక్రెటరీ యనమల హేమ సుందర్, సంతోష్, నగర కార్యవర్గ సభ్యులు చింటూ, చరణ్, వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.