పాఠశాలకు తిరిగి స్వాగతం
బడి గంట మొగనుంది..
పాఠశాల వైపు విద్యార్థుల అడుగులు!
మధుర జ్ఞాపకాలకు విరామం.. పుస్తకాలతో నవశకం
పాఠశాలల్లో సిద్ధమైన స్వాగత ఏర్పాట్లు
సెలవుల సందడి ముగిసింది. వేసవి విశ్రాంతి అనంతరం సిద్దిపేట్ జిల్లాలోని మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు సోమవారం (జూన్ 15) నుండి పునఃప్రారంభం కానున్నాయి. నెలల తరబడి ఆటపాటలతో, పల్లెటూరి ఒడిలో అమ్మమ్మ, తాతయ్యల ప్రేమను ఆస్వాదిస్తూ గడిపిన విద్యార్థులు, మళ్ళీ పుస్తకాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.
వినోదానికి పుల్‌స్టాప్.. విజ్ఞానానికి శ్రీకారం
వేసవి సెలవులు అనేగానే ముందుగా గుర్తొచ్చేవి అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లు. ఉమ్మడి కొత్తగూడ మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులందరూ పల్లెటూరి వాతావరణంలో, తోటి మిత్రులతో కలిసి చెట్లు ఎక్కడం, కబడ్డీ, కోకో వంటి ఆటలతో కాలక్షేపం చేశారు. ఈ సుదీర్ఘ సెలవుల ముగింపుతో, ఇప్పుడు ఆటపాటల నుండి పాఠశాలలోని తరగతి గదుల వైపు విద్యార్థుల దృష్టి మళ్లింది. సోమవారం నుండి విద్యార్థులు తమ వినోదపు ప్రపంచానికి పుల్‌స్టాప్ పెట్టి, చదువుల లక్ష్యంతో తిరిగి పాఠశాలలకు రానున్నారు.
'బడిబాట'తో సందడి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బడిబాట' కార్యక్రమం, పాఠశాలల పునఃప్రారంభాన్ని పండుగలా మార్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి, బడి వయస్సు గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు.
వేడుకలు: పాఠశాల ఆవరణలను తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో ఉపాధ్యాయులు సుందరంగా తీర్చిదిద్దనున్నారు.బడిబాటలో భాగంగా చేరిన నూతన విద్యార్థులకు పూలమాలలు వేసి, మిఠాయిలు పంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.