🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Jun, 2026 | Page: 1

సూపర్ సండే- వరల్డ్​కప్​లో బిగ్ ఫైట్- ఇవాళే భారత్ vs పాక్ మ్యాచ్- ఎక్కడ చూడాలో తెలుసా?

2026 మహిళల టీ20 వరల్డ్​కప్​లో హై వోల్టేజ్ మ్యాచ్​కు సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని గంటల్లోనే ఈ పొట్టికప్పు టోర్నీలో భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​తోనే హర్మన్​సేన ఈ టోర్నీని ఆరంభించనుంది. అందుకే విజయంతో వరల్డ్​కప్​ను ప్రారంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటి? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడవచ్చు అనే విషయాలు చూద్దాం!

భారత్ బలంగా!
గతేడాది వన్డే వరల్డ్​కప్ నెగ్గిన జోష్​లో టీమ్ఇండియా ఈ టోర్నీ బరిలో దిగుతోంది. అయితే ఇటీవల ఇంగ్లాండ్​తో సిరీస్​ కోల్పోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడుతోంది. కానీ, పాకిస్థాన్​పై విజయం సాధిస్తే అమ్మాయిల కాన్ఫిడెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లుగా షఫాలీ, స్మృతి మంధాన రానున్నారు. హర్మన్​ ప్రీత్ కౌర్​, జెమీమా రోడ్రిగ్స్​, భారతి పుల్మాలి, రిచా ఘోష్​లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తుంది.

ఆల్​రౌండర్ దీప్తి శర్మపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బ్యాటుతోపాటు బంతితో దీప్తి రాణిస్తే టీమ్ఇండియాకు ఢోకా ఉండదు. రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందిని శర్మలతో బౌలింగ్ విభాగం కూడా గట్టిగానే కనిపిస్తుంది. అయితే ఇంగ్లాండ్ పిచ్​లపై రీసెంట్​గానే భారత్ టీ20లు ఆడడం కలిసొచ్చే అంశం. అక్కడి పరిస్థితులపై భారత్​కు ఓ అవగాహన ఏర్పడింది.

పాకిస్థాన్ జట్టు ఇలా!
పాకిస్థాన్ కూడా పూర్తి బలంతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు అతిపెద్ద ఆయుధం వారి స్పిన్ బౌలింగ్ విభాగం. స్పిన్నర్లు సాదియా ఇక్బాల్, నిదా దార్‌లు ఆ జట్టులో అనుభవజ్ఞులైన బౌలర్లు. ప్రత్యర్థి స్కోర్ వేగాన్ని తగ్గించి, మధ్య ఓవర్లలో వికెట్లు తీసి దెబ్బకొట్టగలరు. అలాగే ఫాతిమా సనా నాయకత్వంలోని ఈ జట్టులో అనుభవజ్ఞులైన మునీబా అలీ, సయ్యదా అరూబ్ షా, ఐమాన్ ఫాతిమా వంటి యువ క్రీడాకారిణులు ఉన్నారు. వీళ్లపై పాక్​ బాగా ఆధారపడొచ్చు!

Head To Head Records
2009లో భారత్- పాకిస్థాన్ మహిళల జట్లు తొలిసారి టీ20లో తలపడ్డాయి. ఆ మ్యాచ్​లో భారత్ అమ్మాయిలు దాయాది దేశాన్ని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఓవరాల్​గానూ పాకిస్థాన్​పై టీమ్ఇండియాదే పైచేయిగా ఉంది. ఇప్పటిదాకా అంతర్జాతీయ టీ20ల్లో ఇరుజట్లు 16 మ్యాచ్​ల్లో తలవడ్డాయి. ఇందులో భారత్​దే పూర్తి ఆధిపత్యంగా ఉంది. టీమ్ఇండియా ఏకంగా 13 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. పాకిస్థాన్​ జట్టు మూడుసార్లు నెగ్గింది. చివరిసారిగా ఈ రెండు జట్లు 2024 టీ20 వరల్డ్​కప్​లో తలపడ్డాయి. అందులో పాక్​పై భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
🏠 Home