🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Jun, 2026 | Page: 1

కారులో యువతిని తీసుకెళ్లి నిద్రమాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించిన యువకుడు - స్పృహ కోల్పొయాక ఊపిరాడకుండా చేసి హత్య - మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన నిందితులు

మన్యం జిల్లా పాలకొండ మండలం బర్నసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి(32) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితుడు ఎం.సింగుపురం గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ రెడ్డి భువనేశ్వర్ అని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ కేసు వివరాలను ఆయన పాలకొండలో వెల్లడించారు.

'ఉషారాణి గత ప్రభుత్వంలో వాలంటీర్గా పని చేసిన సమయంలో భువనేశ్వర్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే కాంట్రాక్టు స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న వివాహిత తీగల కృపారాణితో నిందితుడు భువనేశ్వర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమించిన యువతితో వివాహాన్ని జాప్యం చేస్తూ వచ్చాడు. తనను వివాహం చేసుకోవాలని ఉషారాణి పదే పదే ఒత్తిడి తేవడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను హత్య చేసేందుకు వివాహితతో పాటు సోదరుడైన మరో వ్యక్తితో కలిసి పథకం పన్నాడు.

చేతులు తాడుతో కట్టేసి, బరువైన రాయిని నడుముకు కట్టి : ఈనెల 6వ తేదీన కారులో యువతిని తీసుకెళ్లిన నిందితులు, కృపారాణి ఇచ్చిన నిద్రమాత్రలు కలిపిన కూల్డ్రింకును యువతి చేత తాగించారు. ఉషారాణి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నిందితుడు భువనేశ్వర్ తనకు సోదరుడైన సవిరిగాన తేజేశ్వరరావుతో కలిసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలోని ఓ పెట్రోల్బంకు వెనకున్న చెరువులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, చెరువులో నీరు లేకపోవడంతో దొరికిపోతామని భావించి, మళ్లీ అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వచ్చి, మృతదేహాన్ని తీసి, చేతులు తాడుతో కట్టేసి, బరువైన రాయిని నడుముకు కట్టి పాలకొండ పరిధిలోని తుమరాడ వద్దనున్న కామినాయుడు చెరువులో పడేశారు'. నిందితులు కారులో వెళ్తూ పట్టణ శివారున పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిందితులు వాస్తవాలు వెల్లడించినట్లు చెప్పారు.
🏠 Home