🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 11 Jun, 2026 | Page: 1

డిజిటల్ ఏఐ‌ యుగంలో కూడా బాలకార్మిక దురాచారమా

12 జూన్‌ “ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం” సందర్భంగా

అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్వచనం ప్రకారం, బాలల్ని ఉపాధులు లేదా ఉద్యోగాల ఉచ్చులో బంధించి వారి బాల్యాన్ని, శక్తియుక్తులను, గౌరవాన్ని, సంపూర్ణ ఎదుగుదలను, శారీరక మానసిక ఆరోగ్యాన్ని హరింపజేసే లేదా నలిపి వేసే ప్రయత్నాలను బాల కార్మిక వ్యవస్థ అని అంటాం. అంతర్జాతీయ, జాతీయ చట్టాలు, నియమనిబంధనలకు వ్యతిరేకంగా పిల్లలను (5 నుంచి 17 ఏండ్ల లోపు) కార్మికులుగా మార్చి వారి బంగారు భవితను బుగ్గిపాలు చేయడాన్ని బాల కార్మిక దురాచారం అని అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నేటికీ 160 మిలియన్ల బాల కార్మికుల బతుకులు ఉపాధుల పేరుతో బుగ్గిపాలు అవుతున్నాయి. వీరిలో వయస్సు 5 - 11 ఏండ్ల లోపు ఉన్న బాలలు 48 శాతం, 12 - 14 ఏండ్ల వారు 28 శాతం, 15 - 17 ఏండ్ల లోపు పిల్లలు 24 శాతం ఉండడం గమనించారు. ఆఫ్రికాలో 20 శాతం బాలలు, ఏసియా పసిపిక్‌లో 7 శాతం, అమెరికన్లు 11 శాతం, యూరోప్‌-సెంట్రల్‌ ఆసియాలో 4 శాతం, అరబ్‌ ప్రాంతాల్లో 3 శాతం బాల కార్మికులు నమోదు అవుతున్నారు. ప్రపంచ బాల కార్మికుల్లో దాదాపు 56 శాతం మధ్య ఆదాయ దేశాల్లోనే ఉండడం ఆశ్చర్యంగా ఉన్నది.

భారతంలో బాల కార్మిక దురాచారం:
బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడంలో భారత్‌ కొంత ప్రగతిని సాధించినప్పటికీ మరింత దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతున్నది. 2011 వివరాల ప్రకారం, 5 - 14 ఏండ్ల లోపు బాల కార్మికులు 43.53 లక్షల ఉన్నారని, 2001లో వీరి సంఖ్య 1.26 కోట్లు ఉండేదని గమనించాలి. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక-ఆర్థిక సమస్యలతో బాల కార్మిక వ్యవస్థ ప్రధానంగా ముడిపడి ఉంటుంది. భారత బాల కార్మికులు అధికంగా వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, బాణాసంచా తయారీ కేంద్రాలు, కాల్పెట్‌ పరిశ్రమ, మైనింగ్‌, రెస్టారెంట్లు లాంటి రంగాల్లో మగ్గుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం 14 ఏండ్ల లోపు పిల్లలను చట్టవ్యతిరేకంగా పనిలో పెట్టుకోవడం లేదా ప్రమాదకర పరిస్థితుల్లో బతుకులను గడపడం చట్టవ్యతిరేకమని తెలుపుతున్నది. బాల కార్మిక దురాచారాన్ని రూపుమాపడానికి 1986 బాల కార్మిక చట్టం, 2017 బాల కార్మిక చట్ట సవరణ, 1987లో బాల కార్మికుల జాతీయ పాలసీ లాంటివని తేవడం, అమలు పరచడం జరుగుతున్నది.

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం-2026:
ఐరాస-అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ)-యూనిసెఫ్‌ సంయుక్త‌ చొరవతో ప్రతి ఏట 12 జూన్‌న “ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం ( వరల్డ్‌ డే అగెనిస్ట్‌ చైల్డ్‌ లేబర్‌)”ను పాటించడం ఆనవాయితీగా మారింది. ఈ వేదికగా బాల కార్మిక దురాచారాన్ని కట్టడి చేయడం, అవగాహన కల్పించడం, కఠినంగా చట్టాలు అమలు చేయడం, బాలలకు/కుటుంబాలకు సరైన సహాయాలు అందించడం లాంటివి జరుగుతున్నాయి. 2026 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం ఇతివృత్తంగా “బాలకార్మిక వ్యవస్థకు రెడ్‌ కార్పెట్‌ : బాలలకు న్యాయమైన ఆట, పెద్దలకు గౌరవప్రదమైన పని” అనబడే అంశాన్ని తీసుకున్నారు. బాలలు చదువుకోవడం, ఆడు కోవడం, సురక్షిత బాల్యం కొనసాగడానికి మాత్రమే అవకాశం కల్పించాలని కుటుంబ పెద్దలు తెలుసుకోవాలి. పిల్లల శ్రమను దోపిడీ చేయడం, చిన్నారి చేతులకు/దేహానికి/మనస్సుకు గాయాలు చేయడం, బాలల బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచేయడం అమానవీయం, ఆక్షేపణీయం అని నినదించాలి.

బాల కార్మిక దురాచార నిర్మూలనకు సవాళ్లు:
బాల కార్మిక దురాచార నిర్మూలనకు సవాళ్లుగా పేదరికం, నిరక్షరాస్యత, తల్లితండ్రుల నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, విద్యకు దూరంగా ఉండడం, సామాజిక కట్టుబాట్లు, చట్టాల అమలులో నిర్లక్ష్యం, సామాజిక అంగీకారం, ప్రలోభ యాజమాన్యాలు, అవగాహన లోపం, పౌర సమాజ నిశ్శబ్దం లాంటివి అడ్డుగా నిలుస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి తీసుకోవలసా చర్యల్లో పేదరిక నిర్మూలన, తల్లితండ్రులకు ఉద్యోగ ఉపాధుల కల్పన, పాఠశాలల అందుబాటు, అక్షరాస్యత/అవగాహన పెంచడం, సామాజిక భద్రత కల్పించడం, ప్రభుత్వాలు/పౌర సమాజం/అంతర్జాతీయ సంస్థల సమైక్య కృషి, విద్యపై పెట్టుబడులు పెంచడం, నైపుణ్యాల వృద్ధి, వయోజనులకు ఉద్యోగ కల్పన లాంటివి నిత్యం కొనసాగాలి.

బాలల ఆరోగ్య సంరక్షణ, పిల్లల గౌరవాన్ని కాపాడడం, విద్య అవకాశాలు కల్పన, ఆటపాటల కొనసాగింపుకు గట్టి కృషి జరగాలి. ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న బాలల మనసులకు పడుతున్న తూట్లు, విరుగుతున్న ఎముకలు, శ్వాస ఇబ్బందులు, శారీరక గాయాలు, విష రసాయనాల దుష్ప్రభావాలు, ఆందోళనలు, మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, సామాజిక-శారీరక-మానసిక ఎదుగుదల సమస్యలు, చిన్నారుల శ్రమ దోపిడీ లాంటివి బాల్యాన్ని చిదిమేయడం నేటి డిజిటల్‌ యుగంలో సహితం జరగడం సోచనీయం. ఇప్పటికైనా బాల కార్మిక దురాచారాన్ని ప్రపంచం నుంచి పాతాళానికి తరిమేద్దాం, బాలలకు పూర్తి స్వేచ్ఛనిద్దాం.

డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
🏠 Home