స్లైన్లు పెడుతూ.. మందులు ఇస్తూ..
అంబర్‌పేట: వైద్యులు, నర్సింగ్ అధికారుల కొరతతో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఆగమాగమవుతోంది. అక్కడ ఆయాలే రోగులకు స్లైన్లు పెడుతున్నారు. మందులు వేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఆయాలు రోజువారీ అనుభవంతో రోగులకు తోచిన వైద్యసేవలు అందిస్తుండడంతో గ్రహచారం బాగాలేక ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో వైద్యశాల నిర్వహణ గందరగోళంగా మారిందని రోగులు ఆరోపిస్తున్నారు. అసలే వర్షాకాలం. ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యాయి. వారం పది రోజుల్లో సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ, చిగున్ గున్యా, డిప్తీరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే సమయంలో ఫీవర్ హాస్పిటల్‌ను సిబ్బంది కొరత వేధిస్తుండడంపై రోగుల్లో ఆందోళన మొదలైంది.