‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
పంజాబ్ సింగర్ దలేర్ మెహందీపై ఒక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సింగర్ మద్యం సేవించి పాటలు పాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఏమాత్రం తగదంటూ ఆ గాయకుడిపై మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా కుంజాపురి జాతరలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పంజాబ్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు దలేర్ మెహందీ తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.కాగా, ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వేదికపైకి వచ్చిన ఆయన పాడటం ఆపేయాలని దలేర్ మెహందీని కోరారు. ఆ తర్వాత పంజాబ్ సింగర్‌పై ఆయన మండిపడ్డారు. ‘నవరాత్రి సందర్భంగా దుర్గామాతకు సంబంధించిన కార్యక్రమం ఇది. మీరు మద్యం సేవించి ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఇది ఏమాత్రం తగదు’ అని అన్నారు.మరోవైపు ఈ వేడుకలకు ఉన్న మతపరమైన ప్రాముఖ్యత దృష్ట్యా, ఆ సందర్భానికి తగిన గౌరవాన్ని, మర్యాదను కళాకారులు పాటించాలని మంత్రి సుబోధ్ ఉనియాల్ సూచించారు. ‘ప్రజలకు వినోదాన్ని అందించాలని మిమ్మల్ని పిలిచాం. కానీ మీరు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది తప్పు, చాలా తప్పు. మీకు మంచి పేరుంది. దానిని మేము గౌరవించాలి. అందుకే మిమ్మల్ని ఆహ్వానించాం’ అని ఆయన అన్నారు.