🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Oct, 2026 | Page: 1

నేదునూరి కనకయ్యగారు అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం

కరీంనగర్ మట్టిలో మరో కావ్య పరిమళం: నేదునూరి కనకయ్య
వైవిద్య జీవితంలో బహుముఖీన స్ఫూర్తి ఏ ఒక్కరి సొంతం కావు. చెమటోడ్చే శ్రమ గీతంలో బాధలు, కన్నీళ్ళు పేదరికం చారలు మరెన్నో. ఆ ఇబ్బందులు అవరోధాలు ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యంతో కృషిచేసిన సాధారణ మొక్కలో కనిపించే అసాధారణ ఆకుపచ్చ అక్షరాల చెట్టు నేదునూరు కనకయ్య. ఆయన పేదరికాన్ని జయించిన అజేయుడు.అక్షరాలతో శ్వాసించిన గొప్ప అధ్యాపకుడు ఆయన.అన్నీ తానై సామాజిక రుగ్మతలపై పోరాడే నిరంతర చిరునామా. బాధలను ఎదిరించే ధైర్యం, యుక్తి, శక్తి, విద్యను తన సేవాగుణంతో సమాజానికి చేరవేస్తున్న కరీంనగర్ విద్యాగంధం, కమ్మని కవిత్వం రాస్తున్న కవి సృజన జీవి. ఓ సంఘసంస్కర్త...ఓ ఆర్థిక సామాజికవేత్త. ఆయనలో మనిషిని పలుకరించే బహుజన గీతాలున్నాయి.అవే ఆయనకు సామాజిక ప్రాణదీపాలు.
కరీంనగర్ కమ్మని కావ్యంలో ఆర్థికశాస్త్ర లెక్చరర్ గా సామాజిక సేవలో తరించిన నేదునూరు కనకయ్య ఒక పేజీని రాసిన భద్రపరిచింది కాలప్రవాహం.కష్టాల కడలిని ఈదిన గొప్ప స్వాప్నకుడు. జీవిత ప్రయోగశాలలో పేదరికం టెస్ట్ ట్యూబ్ లో అంచెలంచలుగా సగటు విద్యార్థిగా ఎదిగిన ఆయన తల్లిదండ్రులు నేదునూరి వీరమ్మ బాలయ్య దంపతులకు అక్టోబర్ 14,1955న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలో కల్లెపెల్లి పల్లెటూరులో బహుజన సామాజిక జాతిలో శాలివాహన కులంలో పుట్టారు.తండ్రి వ్యవసాయంతో పాటు కులవృత్తిగా మట్టితో కుండలుచేసి కుటుంబ జీవనం సాగించారు. కనకయ్య తండ్రితకి కుటుంబ సభ్యులకు సహాయకారిగా ఉండి కులవృత్తిలో,వ్యవసాయ క్షేత్రంలో పనిచేశారు.
కుండలు కాల్చే వామిలోకి పొరుక పుల్లలను ఏరుకొచ్చే పని,అలాగే గొడ్లను కాయడం కూడా ఆయన జీవన నేస్తాలుగా మారాయి.కడు పేదరికం ఒక వైపు తాండవించడం,మరోవైపు నిరక్షరాస్యత కుటుంబం ఎక్కిరించడం వంటి సామాజిక రుగ్మతలు కాలరెగిరేసే కాలంలో కరెంటు లేని వీధులు,ఇళ్లలో గుడ్డిదీపాల వెలుగే గుడ్డిలో మెల్లగా మెరిసి మొక్కవోని ధైర్యం ఆయనను దీపదారిగా ముందుకు నడిపించడం ఒక చరిత్ర.
ఆయన బాల్యమంతా కష్టాల కల్పతరువుగా ఉన్న రోజులలో చదువు, బడిబాట కూడా సాహస పోరాటమే. పుట్టిన ఊరులో ప్రాధమిక బడిలో, బెజ్జెంకి పాఠశాలలో సెకండరీ విద్య కరీంనగర్ లో ఇంటర్,డిగ్రీ విద్య చదివిన కనకయ్య హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ., చదివారు. అంతేకాదు కరీంనగర్ జిల్లాలోని అన్ ఆర్గనైజ్డ్ చైల్డ్ లేబర్ సోషియో ఎకనామిక్ కండీషన్స్ పై ఎం.ఫిల్ కె.యూ, వరంగల్ లో ప్రొ.వెంకట నారాయణగారి మార్గదర్శకత్వంలో పూర్తిచేశారు.ఆయన విద్యా జీవితంలో అది మరో ముందడుగు.అలాగే మరెన్నో కోర్సులను చేసిన గొప్ప విద్యా శిఖరం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.లోతుగా ఆలోచిస్తే కనకయ్యలో గల అక్షర దాహం అర్థమవుతుంది. చేసుకోవచ్చు. దాన్ని తీర్చుకునే యజ్ఞంలో ఆయన చేసే కృషి తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కరీంనగర్ బిషప్ జూనియర్ కాలేజీలో ఆర్థిక శాస్త్ర లెక్చరర్ గా బోధన వృత్తిని చేపట్టడం కనకయ్య జీవితంలో పెద్ద మలుపు.అదే ఆయన జీవన మైలురాయి కూడా.
విద్యార్థి జీవితంలో నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్న కనకయ్య వివిధ పాఠశాలలో కాలేజీల్లోనూ విద్యార్థి సంఘ అధ్యక్షకార్యదర్శ పదవులను చేపట్టారు.విద్యాలోకం బాగోగులు అభివృద్దితో పేద విద్యార్థుల సంక్షేమం కోసం పారదర్శకంగా పనిచేసిన సగటు మనిషి నేదునూరి కనకయ్య.బాల్యం నుండీ అనేక విషయాలను అనుభవ పాఠాలుగా ఆకళింపు చేసుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకునే కళను నేర్చుకున్నారు. సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిన గొప్ప సాహస విద్యా యాత్రికున్ని ఆయనలో చూసి బాగుపడ్డ విద్యార్థుల గాధలేన్నో...మానవీయత సమానత ధ్యేయంగా ఆయన కొన్ని వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దినారు.అదో ఘన రికార్డుగా అక్షరబద్ధమైన ఆలోచనల సుక్షేత్రం కూడా.
కనకయ్య వివాహం బంధం 1980లో మేడమ్ సరిత తో జరిగింది.ఆమె హైదరాబాద్ లోని ప్రఖ్యాత సంఘసేవకులు జలిగామ ఈశ్వరయ్య కూతురు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రముఖ న్యాయకోవిదుడు జస్టిస్ కుమారయ్యగారి మనుమరాలు. దాంతో సంఘసేవ విద్యాభ్యాసంతో పాటు బోధన మారాకు తొడిగింది కాబోలు.పెద్దలు అనుభవజ్ఞుల సహచర్యం ఆయన ఆలోచనలకు సానపెట్టి స్థిరచిత్తంతో సాకారంచేసుకునే అవకాశం ఆయనలో లోతుగా చొచ్చింది కాబోలు.

కనకయ్య సార్ లో మరో అత్యంత విలువైన కోణం సాహిత్య సృజన.
అంపశయ్య నవీన్ ప్రముఖ నవల రచయిత గారి రచనలు చదివి రచన వ్యాసంగం పట్ల ప్రభావితుడయి కవిగా రచయితగా గెలిచి నిలిచాడు.కవిత్వం సామాజిక వ్యాసాలు ఆయన దినచర్యలో భాగం.కళ్యాణ్ కలంపేరుతో సృజన చేయడం ఆయనలోని సేవాగుణం విద్యాదాన శీలతకు మానవీయ పార్శ్వం పూల పుప్పొడి వాసనలా అలుముకుంది.
ఆయన రచనలు, సాహిత్య కృషి అపారమైనది.విస్తృతమైనది కూడా.ఆయన కళ్యాణ్ కలం పేరుతో రాసిన సంపాదక లేఖలు,కవితలు, పాటలు,వ్యాసాలు,పత్రిక ప్రకటనలు, లేఖలు, సెమినార్ పత్రాలు,నాటికలు మొదలగు సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. బి.ఎ., మొదటి సంవత్సర విద్యార్థిగానే "స్వార్థానికి సంకేళ్లు" నాటిక రాసి కళాశాలలో ప్రదర్శించారు. ఆయన రచయితగా" వాడిన బతుకులు"కథ కూడా రాయడం కొసమెరుపు..
ఇంకా... అట్లనే1990లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకోసం "అర్థశాస్త్రం ప్రాథమిక సూత్రాలు"అను పాఠ్యపుస్తకం రాసారు.అసంఘటిత రంగం లో బాలకార్మికుల సాంఘిక ఆర్థిక పరిస్థితులు వేతనాలు ( కరీంనగర్ పట్టణములో ప్రైవేట్ హోటళ్లలో పనిచేస్తున్న బాల కారికుల జీవితాలమీధ రాసిన) పరిశోధనాత్మక వ్యాసం ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) పబ్లిష్ చేసిన పుస్తకములో ప్రచురించబడ్డది.200లకు పైగా వ్యాసాలు,1000కి పైగా సంపాదకలేఖలు రాశారు.
ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడుగా పలు సదస్సులు అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆయనలోని ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అసోసియేషన్ 6వ వార్షిక సదస్సులో సబ్మిట్ చేసిన పేపర్ ఆన్ ఇరిగేషన్ డెవలప్ మెంట్ ఇన్ కరీంనగర్ జిల్లా కాగా, 23-24జనవరి 1988 శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కరీంనగర్, ఆల్ ఇండియా లేబర్ ఎకనామిక్స్ కాన్ఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ డిసెంబర్ 22-24,1990 హైదరాబాద్, 2009లో "ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో సంస్కరణలు" అను అంశంపై జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్వర్యంలో కార్యక్రమం తో పాటు 2013లో తెలంగాణ వివేక రచయితల సంఘం, తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో "తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణపై సిరిసిల్లలో సదస్సు నిర్వహించారు.
1995లో "సామాన్యుని ఆర్థికపరిస్థితులపై అధ్యనం అంశంపై కార్యక్రమం మరింకా అక్టోబర్20, 2013న "ఉత్తర తెలంగాణ సామాజిక,ఆర్థిక సమస్యలు" యూనివర్సిటీ ప్రొఫెసర్లు రిసెర్చ్ స్కాలర్స్"అను అంశంపై సదస్సు నిర్వహణలో కో కన్వీనర్ గా పాత్ర పోషిచారు. 1999 లోఐక్యరాజ్యసమితి విభాగము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రచురించిన Child labour in the world) "ప్రపంచములో బాలకార్మికులు "అన్న సెమినార్ బుక్ లో నేదునూరి కనకయ్య అసంఘటిత రంగంలో బాల కార్మికుల సాంఘిక ఆర్థిక స్థితి గతులు కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ హోటళ్లలో పనిచేసిన బాలకార్మికుల మీద రాసిన పరిశోధక పత్రం పబ్లిష్ అయ్యింది. అలా సుమారు వెయ్యికి పైగా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత పొందారు.తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన కనకయ్య గారు 1969లో విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో కనకయ్యగారు పాల్గొన్నారు.1997లో సిరిసిల్లలో "తెలంగాణ సదస్సు"నిర్వహించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఉపన్యాసాల ద్వారా తెలిపారు.తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక దోపిడీని నిరసించారు. 2013 అక్టోబర్ 20న కరీంనగర్లో "ఉత్తర తెలంగాణ రాజకీయ,ఆర్థిక వనరులు, సమస్యలు పరిష్కారాలు" అను సదస్సులో కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. కనకయ్య గారు అందుకున్న అవార్డులు, ప్రశంసలు ఎన్నో. అందులో కొన్ని బెస్ట్ యూత్ అవార్డు, 2004 డిసెంబర్ 1న బెస్ట్ ఏయిడ్స్ నోడల్ లెక్చరర్ అవార్డు,20011 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాస్థాయిలో ఉత్తమ అధ్యాపక అవార్డు, 2005లో ఎస్.ఆర్.ఆర్ కళాశాల గోల్డెన్ జుబ్లీ ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నుండి ఉత్తమ ఆర్థికవేత్త అవార్డు,2006లో "ఆర్థిక. సంస్కరణలు ప్రభావం."ఆ
సదస్సులో ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి.రెడ్డిచే ప్రశంసాపత్రం సత్కారం,2011 ఎప్రిల్ 22న తెలంగాణ ఆత్మబంధువు అవార్డు, తెలంగాణ వివేక రచయితల సంఘంచే "సామాజిక,సాహిత్య సేవకులు సత్కారం అందుకున్న బహుముఖీన సామాజిక సాహిత్య ఉద్యమ స్ఫూర్తి.కరీంనగర్ లోని మాజీ ఏపీ ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమారయ్య లా కళాశాల ఫౌండర్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా ప్రముఖ బాధ్యతలు నిర్వహించి కనకయ్య ఎందరికో సహాయపడి ఎందరో రాజకీయ విద్యా సాహిత్య ప్రముఖులచే మన్ననలను పొందారు.అలాగే తెలంగాణ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం తెలంగాణ వికాస వేదిక సంస్థల సంస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన కనకయ్య ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న అనుభవంతో కాలానికి పదును మాటకు అదును తెలిసి రచనా వ్యాసంగం చేసిన కనకయ్య వ్యక్తిత్వం అద్దంలో కొండను చూపడమే గాని ఆయన విరాట్ రూపాన్ని చిత్రించడం ఆరితేరిన కలాలలకే సాధ్యం.నా కరచాలనం ఆయనను దగ్గరగా చూసిన కళ్ళతో, కలిసి నడిచిన అడుగులతో, ఆనందాన్ని ఆలోచనను పంచుకున్న మనసుతో నిత్య కృషీవలుని చిత్రికపట్టిన రవ్వంత అంతరంగ కరచాలన, కనకయ్య సారు బింబప్రతిబింబాల ఆవిష్కరణ ఉత్సుకత ప్రయత్నం ఇది.
డా టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871
(అక్టోబర్ 14 వ తేదీ నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం గారి
71 వ జన్మదిన సందర్భంగా....)
🏠 Home