🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Oct, 2026 | Page: 1

చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన

చెరుకు రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాభావంతో దిగుబడి తగ్గిపోగా, మరోవైపు ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు పెరగడంతో పెట్టుబడి భారంగా మారింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని జహీరాబాద్ డివిజన్ చెరుకు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సగానికి పడిపోయిన దిగుబడి.. పెరిగిన ఖర్చులు
ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరుకు పంట ఎదుగుదలపై ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరాకు 45 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 20 నుంచి 25 టన్నులకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. చెరుకు సాగులో ఎరువులు, దుక్కి దున్నడం, పంట కోత, రవాణా ఖర్చులు రైతులకు భారంగా మారాయి. కూలీలకు రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. చెరుకును ఫ్యాక్టరీకి తరలించే రవాణా ఖర్చులు కూడా తమపైనే పడుతున్నాయని పేర్కొంటున్నారు. దిగుబడి తగ్గిన సమయంలో ఖర్చులు పెరగడంతో నష్టాలు మరింత ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టన్నుకు రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్
చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి టన్నుకు రూ.5,500 ధర నిర్ణయించాలని, అదనంగా ప్రభుత్వం రూ.500 సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు పంట కోత, రవాణా ఖర్చులను ఫ్యాక్టరీ యాజమాన్యాలే భరించాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం టన్నుకు మొత్తం రూ.6 వేల ఆదాయం లభిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.
🏠 Home