🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 11 Oct, 2026 | Page: 1

పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు..

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే మాటలకు పెద్దగా విలువుండదు. అక్కడా అంతా నియంతృత్వమే. ఎవరు అధికారంలో ఉంటే వారిదే పెత్తనం. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వాలో అక్కడి సమాఖ్య ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అక్కడ అధికారంలో ఉన్న పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్‌) ప్రభుత్వాన్ని రద్దు చేసింది. రాష్ట్ర సీఎం సోహైల్ ఆఫ్రిదితోపాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రుల్ని అరెస్టు చేసింది.పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ఆధ్వర్యంలోని సమాఖ్య ప్రభుత్వం దీనిపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రద్దు, ఎమర్జెన్సీ, సీఎం, మంత్రుల అరెస్టు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 232, 234ను ప్రభుత్వం ఉపయోగించింది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీ అంగీకారం తెలిపారు. పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను షరీఫ్ ప్రభుత్వం అరెస్టు చేసి, జైలు నుంచి విడుదల కాకుండా చూస్తోంది. దీంతో ఆయన మద్దతుదారులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.దీనిలో భాగంగా ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం ఆఫ్రిది ఈ నెల 4న ర్యాలీ నిర్వహించారు. ఇమ్రాన్‌ను విడుదల చేయాలని కోరుతూ ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించి ఇబ్బంది కలిగించినందుకుగాను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు, పాలన సహా మొత్తం అధికారం స్థానిక గవర్నర్‌ పరిధిలో ఉంటుంది. ఈ అంశంపై సీఎం సోహైల్ ఆఫ్రిది స్పందించారు. తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా, గవర్నర్ పాలన విధించినా తమ డిమాండ్ల విషయంలో వెనుకడుగు వేయబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
🏠 Home