🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Sep, 2026 | Page: 1

పందిరిగుండుతండాలో తీరిన తాగునీటి సమస్య.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ 19సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) :
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పందిరిగుండుతండా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ వెంటనే స్పందించారు. విషయం ఎమ్మెల్యే దృష్టికి రాగానే ఇరిగేషన్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే బాలునాయక్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు పందిరిగుండుతండాకు చేరుకుని సమీపంలోని పెండ్లిపాకుల రిజర్వాయర్ నుంచి మొండి కట్టల చెరువులో ఏర్పాటు చేసిన బావిలోకి నీటిని తరలించారు. అనంతరం అక్కడి నుంచి బోర్ల సహాయంతో తండాలకు నీటిని సరఫరా చేశారు. దీంతో పందిరిగుండుతండా గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామస్తులకు తాగునీరు అందుబాటులోకి వచ్చింది.
తాగునీటి సమస్యను తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులను రంగంలోకి దించి సమస్యను పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు: సర్పంచ్, గ్రామస్తులు
పందిరిగుండుతండా సర్పంచ్, గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ.. తమ తాగునీటి సమస్యను ఎమ్మెల్యే బాలునాయక్ దృష్టికి రాగానే ఆయన వెంటనే స్పందించారని తెలిపారు. అధికారులను నేరుగా తమ తండాకు పంపించి తాగునీరు అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే బాలునాయక్ తక్షణమే చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి తాగునీరు అందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సమస్య పునరావృతం కాకుండా చర్యలు: అధికారులు
సంబంధిత అధికారులు మాట్లాడుతూ.. పందిరిగుండుతండాలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల మధ్య సమన్వయంతో నీటి సరఫరాను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇకపై తాగునీటి సమస్య పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని అధికారులు తెలిపారు.
🏠 Home