గుంజోటి సర్పంచ్‌కు హైకోర్టులో ఊరట..
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గుంజోటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సర్పంచ్ చెక్ పవర్‌ను నెల రోజుల పాటు నిలిపివేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. అక్టోబరు 6, 2026 వరకు గుంజోటి గ్రామ అభివృద్ధి పనుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.న్యాల్కల్ మండలం గుంజోటి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్డు పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ చెక్ పవర్‌ను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు.ఆయన తరఫున న్యాయవాది ఏ. సంతోష్‌కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ ఉత్తర్వులు పంచాయతీరాజ్ చట్టానికి, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరపకుండానే చెక్ పవర్ నిలిపివేశారని వాదించారు.పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు.. కలెక్టర్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించినట్లు సర్పంచ్ వర్గాలు తెలిపాయి. అలాగే అక్టోబరు 6 వరకు గుంజోటి గ్రామ అభివృద్ధి పనుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు.