ఏపీలో ట్రామాడోల్ దుర్వినియోగం..
ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో అధికారులు మంత్రి సత్యకుమార్‌కు నివేదిక అందజేశారు. అసలు ఈ తనిఖీల వెనుక జంగారెడ్డి గూడెం లో ట్రామాడోల్ దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారం ఉంది.తాజాగా జీలుగుమిల్లి గ్రామంలోని ఆయిల్‌పామ్ తోటలో పెద్ద సంఖ్యలో ఖాళీ, పగిలిన ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీలు కనిపించడంతో జంగారెడ్డిగూడెం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అవి ట్రామాడెక్స్, ట్రామెక్ పేర్లతో ఉన్న ట్రామాడోల్ ఇంజెక్షన్లుగా గుర్తించారు. ట్రామాడోల్‌ను తీవ్రమైన నొప్పిని తగ్గించేందుకు వైద్యపరంగా ఉపయోగిస్తారు. అయితే మత్తు కలిగించే ప్రభావం ఉండటంతో కొందరు దీనిని మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల వైద్యుల సూచన మేరకు, నిబంధనల ప్రకారం మాత్రమే ఈ మందును విక్రయించాలి. అయితే కొందరు మందులదుకాణాల నిర్వాహకులు మధ్యవర్తులతో కలిసి సరైన బిల్లులు, రికార్డులు లేకుండా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ట్రామాడోల్ తయారీసంస్థల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంపిణీ వివరాలను అధికారులు సేకరించి పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని కొన్ని మందుల దుకాణాలు పెద్ద మొత్తంలో ట్రామాడోల్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తనిఖీలలో కొన్ని ఏజెన్సీల అక్రమాలు వెలుగుచూశాయి.డ్రగ్స్ నియంత్రణ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జంగారెడ్డిగూడెం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అరెస్టయిన వారిలో మందుల దుకాణాల యజమానులు, ఒక ఉద్యోగి ఉన్నారు.జంగారెడ్డిగూడెం ఘటనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలపై ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ తదుపరి చర్యలకు సిద్ధమైంది.