🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 05 Sep, 2026 | Page: 1

రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొడంగల్‌లో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పిల్లల భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని సర్వేపల్లి చెప్పేవారని తెలిపారు. గురువు గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.
విద్యారంగంలో 17వ స్థానంలో తెలంగాణ..
పిల్లల ఎదుగుదల, భవిష్యత్‌కు పునాది వేసేది టీచర్లే అని.. పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే అని సీఎం చెప్పుకొచ్చారు. విద్యారంగంలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో విద్యారంగంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు 17వ స్థానానికి చేరిందంటే కారణం టీచర్లే అని కొనియాడారు. టీచర్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్‌ పెరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని వెల్లడించారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 95శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు.
బదిలీల సమస్యలను పరిష్కరించాం..
గతంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. తాను వచ్చాక టీచర్లు అడగకపోయినా ప్రమోషన్లు ఇచ్చినట్లు చెప్పారు. 317 జీవోతో బదిలీల సమస్యలను పరిష్కరించామని.. కేకే కమిటీ ద్వారా సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన వచ్చాక 55 రోజుల్లోనే 10 వేల టీచర్‌ పోస్టులు ఇచ్చామన్నారు. గతంలో DSC నోటిఫికేషన్‌ ఇస్తే ఎప్పుడు పరీక్ష జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు.
ఉత్తమ టీచర్లను గౌరవించుకుంటున్నాం...
బీఆర్ఎస్ హయాంలో రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రతినెలా వందలాది మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారని.. ప్రతి ఉద్యోగికి సగటున రూ.కోటి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగులకు వేల కోట్లు బాకీ పెట్టి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వచ్చాకే ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇచ్చామన్నారు. టీచర్లను విదేశాలకు పంపించి అవగాహన ఇప్పించామని.. ఇవాళ 123 మంది ఉత్తమ టీచర్లను గౌరవించుకుంటున్నామని తెలిపారు.
🏠 Home