🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 02 Sep, 2026 | Page: 1

బొల్లారం ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ..

సికింద్రాబాద్‌ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్‌ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర మిలటరీ ఇంటెలిజెన్స్‌ కూడా రంగంలోకి దిగింది. ఆయుధాల చోరీ వెనుక బయటి వ్యక్తులతో పాటు లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.ఆగస్టు 30 రాత్రి నుంచి 31వ తేదీ తెల్లవారుజాము మధ్య చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మరీలోని ఆయుధాల పెట్టెల తాళాలు పగులగొట్టి ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు సహా మొత్తం 12 ఆయుధాలను అపహరించినట్లు సమాచారం. వీటితో పాటు 21 మ్యాగజైన్లు, 1,912 రౌండ్ల తూటాలు, నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌ కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది.కట్టుదిట్టమైన భద్రత ఉండే సైనిక స్థావరంలోకి ప్రవేశించి ఆయుధాగారాన్ని గుర్తించడం, తాళాలు పగులగొట్టి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించడం సాధారణ దొంగలకు సాధ్యం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఇది ‘ఇంటి దొంగల’ పనే అయి ఉండొచ్చన్న కోణంలో మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ ప్లాన్‌, ఆయుధాల నిల్వ ప్రాంతాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మిల్కా సింగ్‌ గ్రౌండ్‌ సమీపంలోని కెమెరాల్లో తెల్లవారుజామున 3.48 గంటలకు ఓ అనుమానాస్పద బైక్‌ కనిపించినట్లు సమాచారం. ఆ బైక్‌కు చోరీతో సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ ఆధారంగా ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెజిమెంట్‌ ప్రహరీ సమీపంలో ఓ మ్యాగజైన్‌ కూడా లభించింది
🏠 Home