వర్షం కారణంగా ముగిసిన నాలుగో రోజు ఆట..
ఇండియా- శ్రీలంక మధ్య, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 229/6గా ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంక 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, వర్షం కారణంగా ఈ రోజు ఆటను త్వరగా ముగించాల్సి వచ్చింది.క్రీజులో సోనాల్ దినుషా 7 పరుగులతో, కేషర నువాంతా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బుధవారం ఉదయం శ్రీలంక 265/8 వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆ తర్వాత ఐదు ఓవర్లలోనే 290 పరుగులు చేసి, ఆలౌటైంది. దీంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు ఫాలో ఆన్ ఆడే అవకాశం కల్పించింది టీమిండియా. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఐదు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లాహిరు ఉదార 3 పరుగులకే ఔటయ్యాడు.తర్వాత 63 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత 115 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. లంక బ్యాటర్లలో సూర్య బండారా 92 పరుగులు చేసి, జట్టుకు అండగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉండటం విశేషం. అలాగే, కమిందు మెండిస్ 55 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత 209 పరుగుల వద్ద లంక నాలుగో వికెట్, 212 పరుగుల వద్ద ఐదో వికెట్, 218 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో 229 పరుగులకు చేరుకుంది. అయితే, వర్షం కారణంగా ఆటను త్వరగా ముగించాల్సి వచ్చింది.