🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Aug, 2026 | Page: 1

మేల్కో ఓనవతరమా ! విజయాలను చేరుకో

మేలుకో ఓ నవతరమా
విజయాలను చేరుకో
నిరాశా నిస్పృహల్లో
కూరుకుపోకు
ఎప్పుడూ ఆందోళనల్లో
మునిగిపోకు పోలికల
పోటీల బరిలో దిగకు
పరుగుల ప్రపంచంలో
పడిపోకు
ఓయువతరమా
గమ్యం చేరే గెలుపులో
నిన్ను నువ్వు మరువకు
నీ పై నీకున్న నమ్మకాన్ని
వీడకు
చదువు కొలువు అంటూ
విశ్రాంతిని వదల వద్దు
యాంత్రికమైన బతుకుతో
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
ఆశయాల శిఖరాలను
అందుకోవడం నీ హక్కు
అలసటతో కూడిన ప్రయాణం
ఆరోగ్యానికి చేటని తెలుసుకో
రీల్స్ పిచ్చిలో పడి
రియాలిటీ మరిచావు
లైకుల వేటలో
నీ వ్యక్తిత్వాన్ని
అమ్ముకున్నావు
రీల్స్ కామెంట్స్ చూసి
గుండె చెదిరనీయకు
స్క్రీన్ వెనుక బతుకు కాదు
నీ ప్రయాణం
సమాజపు సవాళ్లను
గెలవడమే నీ
జీవిత లక్ష్యం కావాలి

ఉద్యోగం రాలేదనే నిరాశలో
మునిగిపోకు వ్యసనాల ఊబిలో
పడి జీవితాన్ని ముంచుకోకు
ఆర్థిక ఇబ్బందులు
తాత్కాలిక తుఫానులే
నీలోని ప్రతిభకు ఆకాశమే
హద్దులే కులమతాల గోడలు
దాటి ముందుకు నడువు
సమ సమాజ స్థాపనకు
అండగా నిలువు
సమతౌల్య జీవనమే
నీ అసలైన గెలుపు
నిరాశ చీకట్లను చీల్చే
సూర్యుడివి కావాలి నీవు
వర్చువల్ ప్రపంచమే
సర్వస్వం అనుకుంటూ
కన్నవారి ప్రేమను కళ్ళముందే
కాల రాస్తున్నావు
క్షణికానందం కోసం మత్తుకు
దాసోహం అంటున్నావు
డ్రగ్స్ మద్యం మాయలో
జీవితాన్ని తగిలేస్తున్నావు
ఫ్యాషన్ అనుకుంటూ
మొదలుపెట్టిన ప్రతి వ్యసనం
నీభవిష్యత్తును బూడిద
చేసే ఒక విష సర్పం
డబ్బు వెనుక తిరుగుతూ
బంధాలను వీడొద్దు
సమయం లేదనే నెపంతో
నవ్వులను దాచొద్దు
బాధ్యతల నడుమ కొంచెం
నీకోసం బతుకు
మనశ్శాంతిని మించిన నిధి
లేదని తెలుసుకో
కన్న వారి కన్నీరు నీఆశయాల
సమాధి ...ఇదేనా నీ గమ్యం?
మత్తులో తూగడం కాదు
గెలుపు మత్తులో చూడడం
నీలక్ష్యం కావాలి
ఈ డిజిటల్ సంకెళ్లను
వ్యసనాల బంధాలను
తెంచుకొని బయటికిరా
ఓ యువతరమా!
జీవితంలో సమతుల్యత
సాధించు
జీవితంలో నిజమైన
శాఫల్యతను అందుకో
సామాజిక ఒత్తిళ్లకు నువ్వు
తలవంచ వద్దు
తాత్కాలిక సంతోషానికి
జీవితాన్ని తాకట్టుపెట్టద్దు
నిన్ను నీవు గెలిచి సమాజాన్ని
మార్చే మహా శక్తిగా ఎదగాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771
🏠 Home