🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 22 Aug, 2026 | Page: 1

చక్కెర నిల్వలపై యోగి సర్కార్‌ కొరడా..

చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో చక్కెర నిల్వలు, సరఫరా పరిస్థితిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమీక్ష నిర్వహించారు. చక్కెరను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని చక్కెర మిల్లుల్లో ప్రస్తుతం 179.38 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో సహకార చక్కెర మిల్లుల్లో 23.60 లక్షల క్వింటాళ్లు, కార్పొరేషన్‌ మిల్లుల్లో 5.28 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు మిల్లుల్లో 150.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి.ఎవరూ 30 రోజులకు మించి చక్కెర నిల్వలు ఉంచకుండా చూడాలని యోగి అధికారులను ఆదేశించారు. ఒకేసారి 400 టన్నులకు మించి చక్కెర నిల్వ ఉంచే డీలర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం సహా వర్తించే ఇతర చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చెరకు రైతులకు రికార్డు స్థాయిలో చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 48 లక్షల మంది రైతులకు రూ.3,217 కోట్లను చెల్లించినట్లు పేర్కొంది. కొత్త చెరకు క్రషింగ్‌ సీజన్‌ అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది.దేశవ్యాప్తంగా చక్కెర ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంచనాల కంటే తక్కువగా దేశీయ చక్కెర ఉత్పత్తి ఉండటం, పండుగల సీజన్‌ నేపథ్యంలో డిమాండ్‌ పెరగడం, వాతావరణ పరిస్థితుల కారణంగా చెరకు పంట దెబ్బతినడం, ప్రపంచవ్యాప్తంగా చక్కెర సరఫరాలు తగ్గడం, కొందరు వ్యాపారుల అక్రమ నిల్వలు, ఊహాగానాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని కేంద్రం పేర్కొంది. ధరల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా, ధరలు స్థిరంగా ఉండేలా పలు నియంత్రణ, సరఫరా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
🏠 Home