🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Jul, 2026 | Page: 1

అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడు

ఒక ఆగంతకుడు అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడుతున్నాడు. నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్నాడు. వరుసగా రెండు సంఘటనలు జరుగడంతో ఆ గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. (intruder cut women’s hair) బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 16న దర్హార్ గ్రామంలో రాత్రివేళ నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ఒక మహిళ జుట్టు కత్తిరించాడు. అలికిడికి ఆమె మేల్కోగా ఆ వ్యక్తి చీకటిలో మాయమయ్యాడు.
కాగా, నేలపై కత్తిరించిన జుట్టు, కత్తెర ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి ఆ మహిళ షాక్‌ అయ్యింది. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. నల్లదుస్తులు ధరించిన ఆ వ్యక్తి చేతిలో ఒక సంచి ఉన్నట్లు ఆ మహిళ తెలిపింది. తనకు మగతగా అనిపించిందని, అపస్మారక స్థితిలోకి నెట్టడానికి ఏదో పదార్థాన్ని అతడు ఉపయోగించినట్లు ఆమె ఆరోపించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. రాత్రివేళ ఇళ్లల్లో నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడ్ని పట్టుకుని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.
🏠 Home