LIC పాలసీదారులకు షాక్..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కస్టమర్లకు గట్టి షాక్ తగిలింది. ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో నేరుగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని సంస్థ నిలిపివేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సైలెంట్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల క్రితమే తన అధికారిక కస్టమర్ పోర్టల్, మొబైల్ యాప్ నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎల్‌ఐసీ పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ (UPI) మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారం తట్టుకోలేకేనా? సాధారణంగా గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యాప్స్‌లో క్రెడిట్ కార్డ్‌తో ఎల్‌ఐసీ ప్రీమియం కడితే అదనపు ఛార్జీలు పడేవి. కానీ, ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కట్టినప్పుడు మాత్రం బ్యాంకులు వసూలు చేసే గేట్‌వే/కన్వీనియన్స్ ఫీజులను కస్టమర్ల తరఫున ఎల్‌ఐసీ సంస్థే భరించేది. అయితే, ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియంలు కట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బ్యాంకింగ్ ఛార్జీల భారం సంస్థపై మితిమీరిపోవడంతోనే.. ఎల్‌ఐసీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. యాక్సిస్, ఐడీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో కలిసి ఎల్‌ఐసీ జారీ చేసిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు సైతం ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం గమనార్హం.