🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jul, 2026 | Page: 1

వర్షాకాలంలో స్టమక్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి?

వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ఈ కాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు కూడా గణనీయంగా పెరుగుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర సమస్యలను కలిగించే అవకాశం ఉంది.
ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, మురుగునీరు తాగునీటిలో కలవడం, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి.
కడుపులో ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువ అవుతాయి?
భారీ వర్షాల వల్ల మురుగు కాలువలు పొంగిపొర్లడం, తాగునీటి వనరులు కలుషితం కావడం జరుగుతుంది. అదే సమయంలో తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. దీంతో ఆహారం త్వరగా పాడవుతుంది.
కలుషితమైన నీరు తాగడం, బయట మూతపెట్టకుండా విక్రయించే ఆహారం తినడం, శుభ్రంగా కడగని పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఇంట్లో మిగిలిన ఆహారాన్ని సరిగా నిల్వ చేయకుండా మళ్లీ తినడం కూడా ప్రమాదకరమే.
వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే కడుపు సంబంధిత వ్యాధులు
గ్యాస్ట్రోఎంటరైటిస్: విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.
టైఫాయిడ్: కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. దీర్ఘకాలిక జ్వరం, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కలరా: తీవ్రమైన నీళ్ల విరేచనాలు, శరీరంలో నీటి శాతం ఒక్కసారిగా తగ్గిపోవడానికి కారణమవుతుంది.
హెపటైటిస్-ఏ: వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధిలో జ్వరం, వాంతులు, అలసట, కడుపు నొప్పి, కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి?
ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తరచుగా విరేచనాలు కావడం
పదేపదే వాంతులు
అధిక జ్వరం
తీవ్రమైన కడుపు నొప్పి
నీరసం, తల తిరగడం
మూత్రం తగ్గిపోవడం
ఈ వ్యాధుల నుంచి ఎలా రక్షించుకోవాలి?
మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి.
తాజాగా వండిన ఆహారాన్నే తీసుకోవాలి.
బయట మూతపెట్టకుండా అమ్మే ఆహారం, కట్ చేసిన పండ్లు, పచ్చి సలాడ్లు తినకపోవడం మంచిది.
భోజనం చేసే ముందు, తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
పండ్లు, కూరగాయలను బాగా కడిగి మాత్రమే తినాలి.
మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేసి, అవసరమైనప్పుడు మాత్రమే వేడి చేసి తినాలి.
🏠 Home